రహదారులపై టోల్ గేట్ల వద్ద జాప్యాన్ని నివారించేందుకు.. నగదు లావాదేవీలను పరిహరించేందుకు ఫాస్టాగ్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిచేసింది. డిసెంబర్ 1 నుంచి జాతీయ రహదారులపై ప్రయాణించే అన్ని రకాల వాహనాలు 'ఫాస్టాగ్' ఉపయోగించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు టోల్‌గేట్ల వద్ద ఆగకుండానే వెళ్లిపోవచ్చు. జాతీయ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్యక్రమం కింద జాతీయ రహదారు సంస్థ ఈ నిర్ణయం తీసుకొన్నది. వ్యక్తిగత వాహనాల కంటే, వాణిజ్య వాహనాలకు ఫాస్టాగ్ వల్ల గొప్ప ఊరట లభించనున్నది. వేల కిలోమీటర్లు ప్రయాణించే వాణిజ్య వాహనాలు టోల్‌గేట్ల వద్ద క్యూలో నిలుచునే బాధ తప్పడంతోపాటు సమయం, ఇంధనం వృథా కాదు. ఫాస్టా గ్‌ను ప్రస్తుతానికి జాతీయ రహదారులకే పరిమితంచేశారు. అవలంబనా పద్ధతులు, ఒప్పందాల కారణంగా రాష్ట్ర రహదారులకు అందుబాటులోకి రావడం కొంత ఆలస్యం జరుగవచ్చు. వచ్చే మార్చినుంచి రాష్ట్ర రహదారులకు కూడా వర్తింపజేయాలని రాష్ర్టాలు గడువు విధించుకొన్నాయి. జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఒక లేన్‌ను ఫాస్టాగ్‌కోసం కేటాయిస్తారు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఈ లేన్‌గుండా ఆగకుండా వెళ్లవచ్చు. ఫాస్టాగ్ లేకుండా ఆ లేన్‌లోకి ప్రవేశిస్తే.. రెట్టింపు రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఫాస్టాగ్ అమలును దేశవ్యాప్తంగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఫాస్టాగ్ ద్వారా చెల్లించిన టోల్ రుసుము నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 5%, 2019-20 ఆర్థిక సంవత్సరానికి 2.5% క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నారు. నెల పూర్తికాగానే వినియోగదారుల ఫాస్టాగ్ ఖాతాలో ఈ మొత్తం తిరిగి జమ అవుతుంది.
డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి